14, ఏప్రిల్ 2012, శనివారం

నా మామిడిపండు జ్ఞాపకాలు...

ఇండియాలో వేసవి. ఫోన్ చేసినప్పుడల్లా అందరు ఎండలు ఎండలు అని ఒకటే మాట కాని నాకు వేసవికాలం అంటే గుర్తొచ్చేవి రెండే రెండు. ఒకటి మల్లెపూలు, రెండు మామిడి పళ్ళు.అవి లేకపోతె వేసవి వేసవి కానే కాదు. చిన్నప్పుడు అంతగా తెలిసేది కాదు. పరిక్షలయిపోతే ఇక ఎండాకాలం, ఇంటికి వచ్చే అత్తయ్యలు, వాళ్ళ పిల్లలు, ఇంటినబడి ఆటలు పాటలు, ఏ  బాధలు తెలియని చిన్నతనం. వచ్చిపోయే ఋతువుల సంగతి పట్టించుకునే పరిజ్ఞానం ఎక్కడుంది?

ఈ దేశం వచ్చిన తరవాతగాని తెలియలేదు మన చిన్నప్పటి జ్ఞాపకాలు యెంత బలమైనవో, అవి మనల్ని ఎలా మలుస్తాయో. ఏదో మొదలుపెట్టి ఎటో వెళ్తున్నట్టున్నాను. మామిడిపళ్ళ గురించి కదూ..

చిన్న రసాలు!
వేసవిలో ముందర వచ్చేవి రసాలు. ఆహా ఏమి రుచి.. అసలు పండుని ఎలా తినాలో చెప్పటానికి ఒక trainer కావాలండి ఇప్పటి పిల్లలకి. చిన్నరసమే తీసుకోండి, ముచిక తీసి, కిందనిచి మెల్లగా నొక్కుతూ, కిందా మీదా పోసుకోకుండా  రసాన్ని నోట్లోకి రప్పించడం ఒక కళ కదండీ? ఎన్ని పళ్ళు తిని మూతులు చేతులు ఏకం చేసుకుని నేర్చుకున్న ఫలితం అది? అంచేత అధ్యక్షా, ఉన్న 64  కళల్లో రసాలు కింద కారకుండా తినటం కూడా చేర్చాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్షా!   మా పిల్లలకి రసాలు అనే ఒక ఫలరాజం ఉన్నదని  కూడా తెలీదు. మేము జూన్  లో ఇండియా వెళ్ళే సమయానికి (జూన్ ఎందుకంటారా? US లో ఉన్నవాళ్ళ పిల్లలకి అప్పుడే కదా వేసవి సెలవలు?) రసాలనేవి మాయం అయిపోతాయి. ఒక్క మే నెలలో తప్ప మరి కనిపించవు కదా. ఎక్కడో ఒకటి రెండు చోట్ల వున్నా కూడా అంత బావుండనివే.


ఇది మా గుంటూరు బంగినపల్లి!

ఇక పొతే బంగినపల్లి. పెరుగన్నానికి సరిజోడి.మనం కొనేవి కాక, పిల్లలోచ్చారని నాన్నగారి స్నేహితులో, అమ్మ ఫ్రెండ్స్ ఆంటిలో ఎవరో ఒకళ్ళు బుట్టెడు తీసుకురావటం, రోజులో నాలుగుసార్లు తినటం. పిల్లలకి ఎమన్నా అవుతుందని లోపల భయపడినా, మళ్లీ ఎప్పుడో,ఏమిటో అనుకుని ఇష్టం వచ్చినన్ని తినటం,వాళ్ళని తిననియ్యటం. ఇక్కడ నాలుగయిదు రకాల మామిడి పళ్ళు దొరుకుతాయి కాని,మన మామిడిపళ్ల రుచి రానే రాదు. ఏం చేస్తాం? ఇవే అవనుకొని (కోడిని వేల్లాడగట్టి ఉత్త అన్నం తినే కోట శ్రీనివాసరావు లాగ) తినేస్తునాం. మా అమ్మాయి, mom ! this  is  so  delicious  అంటే విరక్తిగా ఒక నవ్వు నవ్వటం తప్ప ఏమి చెయ్యగలం చెప్పండి?


ఇవి అవేనంటారా?
అలాగని చిత్తూర్ మామిడికాయల్ని మరీ  తీసి పారేయ్యలేమండీ! చిన్నప్పుడు అమ్మ అయిదు పైసలిస్తే స్కూల్ బైట చిన్న బల్ల మీద నిలువుగా బద్దలు కోసి, వాటిని అడ్డంగా గాట్లు పెట్టి,పైన ఉప్పు కారం చల్లి ఇస్తే తిన్న చిత్తూర్ మామిడికాయల  రుచి ఎలా మర్చిపోతాం?ఇందులోనే కొబ్బరి మామిడికాయలని ఇంకొక రకం వుంటుంది. ఇంకా పెద్గా, కొంచెం గుండ్రంగా వుంటాయి. అవి కూడా స్కూల్ favourites .ఇలా ఎన్నో రకాలు, ఎన్నో రుచులు.ఉత్తరాభారతియులని అడగండి, వాళ్ళ ప్రాంతంలో ఉండే ఎన్నో రకాలు,మా వాటి రుచి వేటికీ రాదనీ చెప్తారు. ముంబై వాళ్ళని కదిలిస్తే వాళ్ళు కూడా అంతే, ఏవేవో మనకి తెలీని రకాల గురించి,వాటికి తిరుగులేదని చెప్తారు.కొంచెం సరిహద్దులు దాటే సాహసం చేస్తే, పాకిస్తాన్ వాళ్ళు కూడా వాళ్ళ దేశం మామిడికాయల గురించి ఊహల్లోకి వెళ్ళిపోతూ చెప్తారు. మిడిల్ ఈస్ట్ వాళ్ళ specialities వాళ్ళకున్నాయి. ఇక ఇక్కడికొచ్చేవి అన్ని mexico  నించినో, లేదా  దక్షిణ అమెరికా నించినో వస్తాయి.





ఇంకా పచ్చి మామికాయల గురించి ఏమని చెప్పేది? మామిడికాయ పప్పు గురించా?కొబ్బరి మామిడికాయ పచ్చడి?ఆవకాయ? మాగాయ?మామిడికాయ పులిహోర? అక్కడున్న మీ అందరిని చూస్తె నాకు చాల అసూయగా వుంది. తినండి.. తినండి.. రేప్పొద్దున మీకు కడుపునొప్పి రాకపోతే నన్నడగండి!






     

3 కామెంట్‌లు:

  1. అహో... మామిడిపళ్ళు మాకింకా మార్కెట్ లో దొరకటం లేదు గానీ..మీ బ్లాగ్ లో దొరుకుతున్నాయ్ అన్నమాట.

    నిజం.. రసాలు తినటం ఒక ఆర్ట్ అండీ. ముందు బాగా కడిగేసీ, మెత్తగా నులిమేసీ, పైన ముచిక తీసి తింటా ఉంటే సామిరంగా.. అదొక అద్భుతం.
    ఆ తర్వాత బంగినపల్లి గురించిచెప్పేదేముందండీ??
    కొబ్బరి మామిడి కూడా చాలా ఇష్టం నాకు. ఇక ఉప్పూ కారం జల్లుకొని తినేవి కూడా అబ్బో... చిన్నప్పుడు మా అమ్మమ్మగారింట్లో వేసవి మొత్తానికీ ఇవే తిని బతికేవాళ్ళం అన్నం మానేసి. హ్మ్మ్.. చాలావి గుర్తొస్తున్నాయండీ.. రాస్తే పోస్టయ్యేలా ఉంది..

    మొత్తానికి నోరూరించారు మీ మొదటి పోస్ట్ తో..

    చిన్న సలహా.. దయ చేసి వర్డ్ వెరిఫికేషన్ డిజేబుల్ చేయండీ..

    రిప్లయితొలగించండి
  2. బాగుందండీ! నాకు ఈ రెంటితో పాటూ కొత్తావకాయ కూడా గుర్తొస్తుంది!!! హహ నేను ఇక్కడ ఉంటూనే నిన్ననే కూర్చుని ఆవకాయ, పెసరావకాయ పెట్టాను. కనుక వాళ్ళని చూసి కుళ్ళుకోకుండా మనం కూడా పెట్టేసుకొని తిని ఆనందించటమే :) ఎన్ని మామిడి కాయలున్నా ఆవకాయ మాత్రం కొత్తపల్లి కొబ్బరితోనే పెట్టాలి. ఆ రుచే వేరు! మామిడిపండు తినటం ఒక కళ అని మీతో ఏకీభవిస్తూ.... మామిడి రస సారాన్ని మీ టపాలో చూపెట్టారు.

    రిప్లయితొలగించండి
  3. రాజ్ కుమార్ గారు,
    అయ్యబాబోయ్, మీరె మొదట కామెంటినవారు! బోణి చేసినందుకు కృతగ్ఞతలు. మీ హస్తవాసి మంచిదని నాకెవరో చెప్పారు.వర్డ్ వెరిఫికేషన్ తీసేశాను అనుకుంటున్నాను. సలహాకు థాంకులు.

    రసజ్ఞ గారు,
    నా బ్లాగ్ చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు.ఆవకాయలు నేను పెడతానండీ, కాని యేమిటో, యేదొ మిస్సవుతున్నామన్న ఫీలింగ్ పోదు.

    రిప్లయితొలగించండి